ఉరితీయాలని ప్లాన్ వేసి.. చివరకు కత్తితో పొడిచి చంపాడా? సీన్ రక్తికట్టించిన నాగేంద్ర?

సోమవారం, 19 అక్టోబరు 2020 (15:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్యతేజస్విని కేసులో ఇపుడు సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ హత్య తాను చేయలేదని నమ్మించేందుకు ప్రేమోన్మాది నాగేంద్రం అలియాస్ చిన్నస్వామి సరికొత్త అద్భుతంగా నటించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా, సీన్ రక్తికట్టించేందుకు రక్తపుమడుగులో ఉన్న దివ్యను ఆస్పత్రికి తరలించే సమయంలో తనకు తానుగానే గొంతు కోసుకున్నట్టు గట్టిగా నమ్ముతున్నారు. 
 
అసలు దివ్య హత్య జరిగిన రోజు ఏం జరిగిందో మృతురాలి తల్లి పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించింది. విజయవాడ, క్రీస్తురాజపురంలోని పెద్దబావి వీధికి చెందిన వంకాయలపాటి దివ్యతేజస్విని ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈమె ఈనెల 15న దారుణంగా హత్యకు గురైంది. అదేసమయంలో అక్కడ బుడిగ నాగేంద్ర అలియాస్‌ చిన్నస్వామి రక్తపు మడుగులో ఉన్నాడు. 
 
అయితే, ఈ ఘటన జరిగే సమయానికి దివ్య నిద్రలేవలేదని తెలుస్తోంది. 15వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో దివ్యను ఆమె తల్లి కుసుమ టిఫిన్‌ చేయడానికని లేపింది. కాసేపు ఆగిన తర్వాత చేస్తానని దివ్య నిద్రలోకి జారుకుంది. 
 
ఆ తర్వాత ఇంటికి గ్రామ వలంటీర్ రావడంతో తల్లి కిందకు వచ్చింది. అప్పటికే నాగేంద్ర వెనుక వైపు నుంచి దివ్య గదిలో ప్రవేశించి గడియ పెట్టాడు.  పక్క గదికి కూడా గడియ వేశాడు. తల్లి తిరిగి మేడ మీదకు వెళ్లిన సమయంలో బయట అబ్బాయి చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి, తలుపులు కొట్టింది. 
 
ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టే సరికి దివ్య రక్తపు మడుగులో కనిపించింది. నాగేంద్ర ఒక మూలన కూర్చొనివున్నాడు. అప్పటికి అతడి ఒంటిపై చిన్నచిన్న గాయాలు మాత్రమే ఉన్నాయి. దివ్యను ఆటోలో ఆస్పత్రికి తరలించే సమయంలోనే.. సీన్‌ను రక్తి కట్టించడానికి గొంతుపై గాయం చేసుకున్నాడు. 
 
దివ్య ఉన్న గదిలో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌ వేలాడుతూ ఉండడాన్ని పోలీసులు గమనించారు. మొత్తం సీన్‌ను పరిశీలిస్తే దివ్యను చంపాలన్న ఉద్దేశంతోనే నాగేంద్ర ఆమె ఇంటికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందుగా ఉరి వేసి చంపాలనుకున్నాడని అనుమానిస్తున్నారు. 
 
దివ్య తల్లి పెద్దగా కేకలు వేయడం, చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టడంతో దొరికిపోవడం ఖాయమనుకుని.. గదిలో ఉన్న స్టీల్‌ చాకుతో గొంతు కోసి, ఇష్టానుసారం పొడిచాడు. తర్వాత.. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు కథ అల్లాడు.
 
ఈ ఘటన జరిగిన మర్నాడు తెలివిగా రకరకాల లీకులిచ్చాడు. దివ్యతో తనకు వివాహమైనట్లుగా ఫొటోలను బయటకు వదిలాడు. ఇది మార్ఫింగ్‌ ఫొటో అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దివ్య సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన మొత్తం నాగేంద్ర గురించేనని తెలుస్తోంది. 
 
తనకు దివ్య దూరమైన తర్వాత ఆమె స్నేహితురాళ్లను ఉపయోగించుకుని నకిలీ అకౌంట్‌ సృష్టించి వేధింపులు మొదలుపెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దివ్య ఫోన్‌ను విశ్లేషిస్తున్న సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు ఇన్‌స్టామ్‌ అకౌంట్‌లో ఆమె యాక్సిస్‌ ఉన్న వాళ్ల జాబితాను తయారు చేసినట్లు సమాచారం. దాని ఆధారంగా వారిని విచారించే అవకాశాలున్నాయి. 
 
దివ్య వీడియోలో చెప్పినట్టుగా.. ఆ సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు, అతడికి సహకరించిన స్నేహితురాలు ఎవరు అన్న విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోపక్క నాగేంద్ర ప్రవర్తన పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిలో ఒక అపరిచితుడు ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, ఈ హత్య కేసు దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయింది. ఇప్పటివరకు మాచవరం పోలీసులు చేసిన దర్యాప్తును ఇక నుంచి దిశ పోలీసులు కొనసాగిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు