మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు టాలీవుడ్‌లోనేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు కలిసి.. మంచు మనోజ్‌ను ఇంటి నుంచి బయటకు గెంటేశారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ గొడవల్లో మోహన్ బాబు ఏకైక కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తమ ఇంట్లోని గొడవలపై స్పందించారు.
'ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ నలిగిపోతారు. అలా జరగదు అని చెప్పడం అబద్ధం. కానీ, మేము ఉండేది అద్దాల మేడలో.. ఏం చెప్పినా తల, తోక కట్ చేసి వాళ్లకు నచ్చినట్లు రాసుకునే రోజులివి. అలాంటప్పుడు సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం అని నాకు అనిపించింది. అందుకే మౌనంగా ఉన్నాను.
గతంలో ఏది ఒప్పు, ఏది తప్పు అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. దీని వల్ల నేను ఆనందంగా ఉంటానా, బాధపడతానా అని ఆలోచిస్తున్నాను. జీవితంలో ఏదైనా మనకు ఒక పాఠం నేర్పడానికే వస్తుంది. ఏది జరిగినా మౌనంగా ఆలోచిస్తే ప్రశాంతత లభిస్తుంది' అని మంచు లక్ష్మి చెప్పారు.
అలాగే, తన సోదరుడు మంచు మనోజ్ - తేజ సజ్జా కలిసి నటించిన మిరాయ్ చిత్రం ఘన విజయం సాధించింది. దీనిపై ఆమె స్పందిస్తూ, 'మిరాయ్' విజయాన్ని నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. కుటుంబంలో ఎవరికి సక్సెస్ వచ్చినా మా అందరిదిగా భావించి ఆనందిస్తా. ఒకరి కష్టం వృథా కావాలని ఎప్పుడూ కోరుకోను.
జీవిత పాఠాలు నేర్చుకోవాలి అనుకుంటాను.. కానీ, కష్టానికి ప్రతిఫలం రాకుండా ఉండాలని ఎప్పుడూ కోరుకోను. ఎందుకంటే ఈ రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా వాళ్లకు సలహాలు ఇస్తాను. 'మిరాయ్' సక్సెస్‌ను ఎంజాయ్ చేయమని మొన్న కలిసినప్పుడు కూడా మనోజ్‌కు చెప్పాను' అని వెల్లడించారు.