ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అక్టోబరు 2 నాటికి తమ ప్రొబేషన్‌ను పూర్తిచేసుకుని రెగ్యులర్ పేస్కేల్ పరిధిలోకి వస్తారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఫెడరేషన్) చైర్మన్ కె. వెంకటరామిరెడ్డి తెలిపారు.
విజయవాడలో ఆదివారం ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించేందుకు వీలుగా 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించినట్టు తెలిపారు.
వీరి ప్రొబేషన్ సమయం పూర్తికానుండడంతో జూన్ 9న ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. సచివాలయ కార్యదర్శులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులను తొలగించినట్టు పేర్కొన్నారు.
ఇప్పటికే 50 శాతం మంది సచివాలయ సిబ్బంది శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని, వారందరి సర్వీసులు రెగ్యులర్ అవుతాయని తెలిపారు. అనుత్తీర్ణులైన ఉద్యోగుల కోసం సెప్టెంబరులో మరో శాఖాపరమైన పరీక్ష పెట్టాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తామని, అక్టోబరు 2న వీలైనంత ఎక్కువ మంది సిబ్బంది రెగ్యులర్ అవుతారని తెలిపారు.