ఆంక్షలు అతిక్ర‌మించినా కోడ్‌ ఉల్లంఘనే: నిమ్మగడ్డ ర‌మేష్‌కుమార్‌

సోమవారం, 1 మార్చి 2021 (10:41 IST)
మున్సిపల్‌ ఎన్నికల సమయంలో వార్డు వాలంటీర్లు తమ పరిధి దాటి వ్యవహరించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌‌కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఆంక్షలను అతిక్రమిస్తే కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.

కోడ్‌ ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకూ అవకాశముంటుందని హెచ్చరించారు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని.. ప్రభుత్వం ఇచ్చిన విధుల మేరకు వాళ్ల పరిధిలో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఐదుగురికి మించి వెళ్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోనే ఉందని.. అయినా కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు రోడ్‌షోలను పరిమితంగా అనుమతిస్తామని ఎస్‌ఈసీ చెప్పారు. సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు బృందాలను ఏర్పాటు చేస్తామని.. వీటి సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వివరించారు.

ఎన్నికల సమయంలో ఓటింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విషయంపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాయని నిమ్మగడ్డ తెలిపారు.

ఈ విషయంలో కొంత సానుభూతితో వ్యవహరిస్తామని.. వివక్షకు గురైన అభ్యర్థుల అభ్యర్థిత్వాలను పునరుద్ధరిస్తామన్నారు. దీనిపై త్వరలోనే ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. గతంలో నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైనవారు, కొత్త నామినేషన్లను ఇప్పుడు అనుమతించబోమని స్పష్టం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల కోసం జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మెరుగైన పనితీరు ప్రదర్శించబోతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం మరింత మెరుగవుతుందని భావిస్తున్నామని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ పేర్కొ‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు