సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

ఠాగూర్

శుక్రవారం, 22 ఆగస్టు 2025 (10:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో గత 18 రోజులుగా సాగుతున్న సినీ నిర్మాణ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమ్మెకు ముగింపు పలికింది. అదేసమయంలో సినీ కార్మికులకు వేతనాలు పెంచేందుకు టాలీవుడ్ నిర్మాతలు సైతం సమ్మతించారు. దీంతో 18 రోజులుగా కొనసాగిన సమ్మె గురువారంతో ముగిసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాసార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఫలించాయి. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. దీంతో శుక్రవారం నుంచి తిరిగి సినిమా షూటింగులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చిరంజీవి ఓ పోస్ట్ చేశారు. 
 
ఎంతో జఠిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ దేశానికే కాదు ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్‌గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినది. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు