విశాఖపట్నంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో విశాఖకు చెందిన ఈ ప్రేమ జంట.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత గాజువాకలోని ఓ ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలవారు అమలాపురం నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో దుర్గారావు, సుష్మిత మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఓ అపార్ట్‌మెంట్ పైనుండి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.