మళ్లీ పట్టాలెక్కనున్న విశాఖ - కాచికూడ ఎక్స్‌ప్రెస్

ఆదివారం, 11 జులై 2021 (09:58 IST)
విశాఖపట్టణం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ నెల 15 నుంచి ఈ రైలు సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కరోన వైరస్ వ్యాప్తి, ప్రయాణాలపై ఆంక్షలు, లాక్డౌన్ కారణంగా ప్రయాణికుల నుంచి ఆదరణలేక పోవడంతో పలు రైళ్లను రైల్వే శాఖ ఇటీవల రద్దు చేసింది. వీటిలో విశాఖపట్టణం - కాచిగూడ రైలు కూడా ఉంది. 
 
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా అనేక రైలు సర్వీసులను రైల్వే శాఖ పునరుద్ధరిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో విశాఖ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును తిరిగి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు గురువారం (15వ తేదీ) సాయంత్రం 6.40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 
 
అలాగే, తిరుగు మార్గంలో 16న సాయంత్రం 6.25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు