ఆంధ్రల హక్కుగా భావించే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం వాటా లేదని, అందువల్ల దాన్ని ప్రైవేటీకరణ చేయడం తథ్యమని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో విశాఖలో ఉక్కు ఉద్యమం మరోమారు ఉవ్వెత్తున ఎగిసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు.
కాగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి క్లారిటీతో సమాధానమిచ్చారు. దీంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేంద్రం ప్రకటన, సీఎం ఫొటోతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.