ఇంట్లోకి నీళ్ళు! చిక్కుకుపోయిన త‌ల్లీ బిడ్డ‌లు సేఫ్

సోమవారం, 19 జులై 2021 (11:04 IST)
భారీ వ‌ర్షం... ఇంట్లోకి నీళ్ళు వ‌చ్చేశాయి... త‌ల్లి బిడ్డ‌లు ఇంట్లో ఇరుక్కుపోయారు. వెంట‌నే డయ‌ల్ 100 కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు వ‌చ్చి ఆ త‌ల్లి బిడ్డ‌ల‌ను వ‌ర‌ద నీటి నుంచి కాపాడారు. వరద నీటితో జలమయమై ఇంట్లో చిక్కుకున్న తల్లీబిడ్డలను కదిరి పట్టణ పోలీసుల‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అభినందించారు.
 
నిన్న రాత్రి కురిసిన జోరు వాన, వరద నీటితో కదిరి పట్టణం అడపాల వీధి జలమయమైంది. గాండ్లపెంట మండలం తుమ్మలబేడు వలంటీర్ గా పని చేస్తున్న మానస తన 10 నెలలు పాపతో కలసి ఇదే వీధిలో నివసిస్తోంది. రాత్రి కురిసిన వర్షపు నీరుతో ఈమె ఇల్లు, పరిసరాలు జలమయమయ్యాయి. బిడ్డతో సహా తనకి ప్రమాదం ఏర్పడిందని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో డయల్ - 100 కు సమాచారం చేరవేసింది.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా డయల్ - 100 సిబ్బంది కదిరి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో కదిరి డీఎస్పీ భవ్యకిశోర్ పర్యవేక్షణలో అర్బన్ సి.ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ దేవేంద్ర, హోంగార్డు లక్ష్మినారాయణలు ఆ ప్రాంతానికి వెళ్లారు. వర్షపు నీటితో ఆ ప్రాంతమంతా జలమయమై ఉండటం...నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితులతో టైరు ట్యూబ్ లు, తాళ్లు సేకరించి వాటి సహాయం ద్వారా మానస ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ప్రాణ భయంతో తన ఇంట్లో  ఎదురుచూస్తున్న తల్లీబిడ్డను అక్కడి నుండి తరలించి సురక్షిత ప్రాంతంలోని ఓ ఇంటికి చేర్చారు. పోలీసుల చేసిన సేవల పట్ల మాన‌స సంతోషం వ్యక్తం చేసింది. కదిరి డీఎస్పీ భవ్యకిశోర్ , అర్బన్ సి.ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ దేవేంద్ర, హోంగార్డు లక్ష్మినారాయణలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కూడా అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు