రాజధాని అమరావతి ప్రాంతంలో వాటర్ లేక్స్ : మంత్రి నారాయణ వెల్లడి

ఠాగూర్

ఆదివారం, 25 ఆగస్టు 2024 (19:43 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగు మెగా పార్కులతో పాటు వాటర్ లేక్స్‌ను నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీ పార్థసారధి భాస్కర్‌తో కలిసి ఆయన శనివారం ఏడీసీ అభివృద్ధి చేసిన వెంకటపాలెం నర్సరీ, శాఖమూరు సెంట్రల్ పార్కులను పరిశీలించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో ఆహ్లాదకరమైన ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధానికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు బ్లూ, గ్రీన్ కాన్సెప్ట్ పర్యాటక ప్రాజెక్టులను చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆరు నెలల్లో రాజధానిలో నాలుగు పెద్ద పార్క్‌లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 300 ఎకరాల్లో శాఖమూరులో సెంట్రల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
 
శాఖమూరు, అనంతవరం, నీరుకొండ ప్రాంతాల్లో సుందరమైన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. శాఖమూరు సెంట్రల్ పార్కులో బోటింగుకు అనువుగా 50 ఎకరాల్లో రిజర్వాయర్‌ను నిర్మించి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
నీరుకొండలో 500 ఎకరాల్లో వాటర్ లేక్స్ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్కులను ఏర్పాటు చేసి వీటిలో విభిన్న రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నామని మంత్రి నారాయణ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు