ఈ యేడాది ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అయితే, తాజాగా మరో రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో మరోమారు వరద పెరిగింది.
ఏ జలాశయంలోనూ వచ్చిన నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో, సోమవారం శ్రీశైలం రిజర్వాయర్‌కు వస్తున్న వరద 74 వేల క్యూసెక్కులను దాటింది. దీంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి 82 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కాగా, శ్రీశైలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా బయటకు పంపుతున్నామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. నేడు గేట్లను మరోసారి ఎత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేట, అల్వాల్, బోయిన్‌పల్లి, తార్నాక, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాచారం, ఎల్‌బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే, దిల్‌సుఖ్‌నగర్, కర్మన్‌ఘాట్, చార్మినార్, మలక్‌పేట, మెహిదీపట్నం, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.