పంచాయితీ దత్తత పేరుతో మోసం చేయం: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:58 IST)
ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని రాజీవ్ కాలనీ పంచాయతీ లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపి బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి ఆశా బీ పాటు వార్డ్ సభ్యులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
 
సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏ కె ఎస్ ఫయాజ్,వైస్ చైర్మన్ ఒబిరెడ్డి, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, కోగటం విజయభాస్కరరెడ్డి, రాగే పరశురామ్ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి చేసే వారిని గుర్తించి వారికి పట్టం కట్టాలని ఆయన తెలియజేశారు. అభివృద్ధి పనులను చూసి తమను ఆదరించాలని ఆయన కోరారు. అమ్మఒడి పథకం ద్వారా చిన్నారుల జీవితాలను, చేయూత పథకం ద్వారా ప్రతి అక్కా చెల్లెమ్మలకు 18,750 రూపాయల ను వారి ఖాతాలో జమ చేసి వారి జీవితాలను మారుస్తున్నామని తెలిపారు.
 
రాజీవ్ కాలనీకి చెందిన పేదలకు కొడిమి సోమలదొడ్డి ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను కేటాయిస్తే ఒక్క అనంతపురం నియోజకవర్గం లోని 30 వేల ఇళ్లపట్టాలను పేదలకు అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన నమ్మకం విశ్వాసమే తాము పెద్ద ఎత్తున అఖండ విజయం సాధించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే కాలువలు రోడ్లను నిర్మించామని తెలియజేశారు.
 
డంపింగ్ యార్డ్ ఫై శాశ్వత పరిష్కారాన్ని చూపించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజీవ్ కాలనీ సమీపంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు పంచాయతీలను దత్తత తీసుకున్న మని చెప్పి కేవలం కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేశాయని,అలాంటి తీరు తమది కాదని ఆయన తెలిపారు. రాజీవ్ కాలనీ పంచాయతీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సుందరగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత ప్రతి విషయంలో తమ ప్రభుత్వానికి అడ్డుతగిలినా కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలను పూర్తి స్థాయిలో అందజేశామని తెలిపారు.
 
వైయస్సార్సీపి బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి దూదేకుల ఆశా బి, వార్డు మెంబర్లను అఖండ విజయంతో గెలిపించి పంచాయతీ అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు. 
సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ అభివృద్దే అజెండాగా పనిచేసేవారికి గుర్తించాలని ఆయన కోరారు. వైసిపి ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఇల్లు, రోడ్లు, కాలువలను నిర్మించి ప్రజాసంక్షేమాన్ని అందజేస్తోందని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించి ప్రజలను పూర్తిగా మోసం చేశారని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు