అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తాం: మంత్రి బొత్స

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:56 IST)
అనర్హులుగా గుర్తించిన పెన్షనర్ల వివరాలను మరోసారి పున:పరిశీలన చేసి అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో మంత్రి బొత్ససత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల 16 వేల 34 మంది పెన్షనర్లను మాత్రమే అనర్హులుగా గుర్తించామని, వారిలో ఎవరైనా అర్హులు ఉండొచ్చనే దృక్పథంతో మరొకసారి వారి అర్హలతను పరిశీలించి నిర్ధారిస్తామని మంత్రి వెల్లడించారు.

అర్జీ పెట్టుకున్న ఐదురోజుల్లోనే నిబంధనలకు అనుగుణంగా వారి అర్హతలను పరిశీలిస్తామని  అర్హులుగా తేలితే గత నెల, ఈ నెల పెన్షన్ ను కలిపి వచ్చే నెలలో ఒకేసారి అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారని, అర్హులైనవారందరికీ పింఛన్లు అందిస్తామని ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి పిలుపునిచ్చారు.
 
ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, నిజమైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. 

గతంలో ఎన్నడూ జరగని విధంగా పెన్షన్ లను ఇంటింటికి, గుమ్మం ముందుకు వెళ్లి పంపిణీ చేసిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా లబ్దిదారులకే పెన్షన్ అందించామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4.16,034 పెన్షన్లర్లను మాత్రమే అనర్హులుగా గుర్తించి తొలగించామన్నారు.

తమ ప్రభుత్వం నెలకు 300 యూనిట్ల కరెంట్ వినియోగించిన వారిని అనర్హులుగా ప్రకటించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 300 యూనిట్ల పైబడి కరెంట్ వినియోగించిన కారణంగా 8900 మంది పెన్షన్లను తొలగించామని తెలిపారు. 

కొత్తగా సుమారు 6,46,724 లక్షల పెన్షన్లు ఇచ్చామన్నారు. తొలగించిన పెన్షన్లు మినహా తాము అదనంగా సుమారు 2 లక్షల పైచిలుకు పెన్షన్లు అధికంగా ఇచ్చామన్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి సుమారు 31 వేల 690  మందికి పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు.

ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ కరెంట్ మీటర్లు లాంటి కారణాలేవైనప్పటికీ కొంతమంది పెన్షన్లు తొలగించబడ్డాయి అని తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా వాటిని పరిశీలించిన నిర్ధారణ చేసుకున్న అనంతరం అర్హులుగా గుర్తించి పెన్షన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ విధానమన్నారు
 
పెన్షన్లు రాలేదని అర్హులైన వారు ఎవ్వరూ నిరాశ, నిస్పృహకు గురి కావద్దని, తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. గతంలో అర్హతలతో సంబంధం లేకుండా పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు కొన్ని నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసిందని,  దాని ప్రకారమే పెన్షన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

పేదలకు మేలు జరగాలనే తమ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. పది మందికి మేలు జరుగుతుంటే... ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో పెన్షన్ల పంపిణీని పరిగణలోకి తీసుకున్నారన్నారు.

పెన్షన్లు ఇచ్చే విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వంలో లబ్ధిపొందాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్న తపనతోనే తమ ప్రభుత్వం ఉందన్నారు.

పారదర్శకంగా తాము పని చేస్తుంటే... ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని దుర్భుద్దితో కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు.  వైఎస్ఆర్ మాదిరిగా ప్రజలకు సంతృప్తస్థాయిలో సంక్షేమాన్ని వైఎస్ జగన్ అందిస్తున్నారన్నారు.

కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వంలో పెన్షన్ల నిబంధనలను సరళతరం చేశామని వివరించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పెన్షన్ల పంపిణీ విజయవంతం అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు.  
 
రాష్ట్రం నుండి కియా సంస్థ, ఇతర పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తమ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, కియా సంస్థ యాజమాన్యం వివరణిచ్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

గత ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిధుల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ మంచి పాలనను తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తుంటే  తమకున్న ప్రచార సాధనాలతో కొందరు ఆర్థికంగా, పారిశ్రామికంగా రాష్ట్రానికి సంబంధించిన లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తూ నష్టాన్ని చేకూరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ లో సైతం రాష్ట్రప్రతిష్ఠ మసకబారేలా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది... నిజాయితీ నిలబడుతుందని మంత్రి వెల్లడించారు. అధర్మం నిలకడగా ఉండదని తెలిపారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్తుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ వార్తాసంస్థ అయినా అసత్య వార్తలు, అవాస్తవాలను కథనాలుగా రాస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ అవాస్తవాలు ప్రచారం చేసినప్పటికీ రీజాయిండర్ ప్రచురించాల్సిన బాధ్యత ఆయా పత్రికలకు ఉంటుందన్నారు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయలు న్యాయబద్దంగా, రాజ్యంగబద్దంగానే ఉంటున్నాయని, చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నామని మంత్రి వివరించారు. జీవోలు జారీ చేయడం కూడా చట్టపరిధిలోనే చేస్తున్నామన్నారు.

తాడేపల్లి మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేయడానికి, సీఆర్డీఏ పరిధికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ప్రజల వినతి మేరకు మున్సిపాలిటీలో విలీనం చేయాలని నిర్ణయించామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు