అమరావతి: కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి సిహెచ్. ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ప్రాజెక్ట్ పరిధిలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు సచివాలయంలో మంత్రిని కలిశారు. మంత్రి వెంటనే ఆర్ అండ్ ఆర్ (రిహాబిలేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) స్పెషల్ కమిషనర్ జి.రేఖారాణి, కడప జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వర రావు, సంబంధిత అధికారులతో సచివాలయం 4వ బ్లాక్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు, 22 గ్రామాలకు చెందిన నిర్వాసితులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.
నిర్ణీత తేదీ(కటాఫ్ డేట్)ని మార్చాలని, వాణిజ్య స్థలాలు కోల్పోయిన వారికి వాణిజ్య స్థలాలు ఇవ్వాలని, మొదటి 14 గ్రామాలకు ఇచ్చిన ప్యాకేజీనే తరువాత 8 గ్రామాలకు కూడా ఇవ్వాలని, 2004-2006 మధ్య ఓటర్ల జాబితాని అందుబాటులో ఉంచాలని, తల్లిదండ్రులు లేని మైనర్ పిల్లలను యూనిట్‌గా గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని, 9 కాలనీలలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు, శ్మశానవాటికలు, దోబీఖానాలు నిర్మించాలని, గృహ నిర్మాణ నిధులు వెంటనే ఇవ్వాలని, బాధితులలలో పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని, కుటుంబంలోని ప్రతి మేజర్ అబ్బాయికీ, అమ్మాయికీ ప్యాకేజీ వర్తింపజేయాలని, కాలనీల నుంచి ప్రధాన రహదారికి అనుసంధాన రోడ్డు నిర్మించాలని, నిర్వాసిత కుటుంబాలలోని చదువుకున్న వారికి ఉద్యోగాలలో వెయిటేజీ ఇవ్వాలని కోరారు.
వారి సమస్యలను, విజ్ఞప్తులను సామరస్యంగా విన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మంత్రిగానే కాకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతగా పేర్కొన్నారు. వాణిజ్య స్థలాలు కోల్పోయిన వారికి వాణిజ్య స్థలాలు కేటాయించమని అధికారులను ఆదేశించారు. దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, దోబీఖానాలకు, ముఖ్యంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించి, నిర్మించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ నిధులను వెంటనే మంజూరు చేయించేయిస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితుల జీవనోపాధికి చిన్నతరహా పరిశ్రమలు, షాపులు పెట్టుకోవడానికి, కుట్టు మిషన్లు, పిండి మిషన్లు, నర్సరీలు వంటి వాటికి, గేదెల కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాను ఆ గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంచమని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో వారి సమస్యలు త్వరగా పరిష్కరించమని చెప్పారు.
ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ నిర్వాసితులు ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్లు వదులుకొని ఎంతో త్యాగం చేశారని, వారికి చట్టపరిధిలో తగిన న్యాయం చేస్తామని చెప్పారు. నిర్వాసితులలో ఆసక్తి ఉన్నవారికి వారికి ఇష్టమైన రంగాలలో తగిన శిక్షణ ఇప్పించి, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. చట్టపరిధిలో అందరికీ ఒకే విధమైన ప్యాకేజీ వర్తింపజేస్తామని, ఎవరికీ అన్యాయం జరగదని చెప్పారు. పునరావాసం కింద ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తుందన్నారు. కడప జాయింట్ కలెక్టర్ కోటేశ్వర రావు మాట్లాడుతూ చట్ట పరిధిలో అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. వ్యక్తిగత సమస్యలను కూడా అవకాశం ఉన్నంతవరకు నిర్వాసితులకు మేలు జరిగేవిధంగా పరిష్కరిస్తామన్నారు.