కడప జిల్లాకు చెందిన ఓ మహిళ పదేళ్ళ క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఆ సమయంలో 11 నెలల కుమార్తెను తన తల్లిదండ్రుల వద్ద వదిలివెళ్లింది. గల్ఫ్‌లో రెడ్డయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం వారిమధ్య జరిగే మాటల సంభాషణల్లో తనకు 14 యేళ్ల కుమార్తె ఉన్నట్టు ఆమె చెప్పింది. దీంతో రెడ్డయ్య ఆ బాలికపై కన్నేశాడు. మహిళకు రూ.10 లక్షల డబ్బు ఆశ చూపించాడు. దీంతో రెడ్డయ్యకు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు సమ్మతించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కడపకు వచ్చారు.
ఇంటికి వచ్చినప్పటి నుంచి రెడ్డయ్యను పెళ్లి చేసుకోవాలని కుమార్తెను తల్లి బలవంతం చేయసాగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తాను పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. దీంతో తల్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసింది. అయినా మాట వినకపోవడంతో గత నెల 29న బాలికను సుండుపల్లెకు తీసుకెళ్లి ఓ ఇంట్లో నిర్బంధించి రెడ్డయ్యతో ఆమెకు బలవంతంగా పెళ్లి చేసింది.
విషయం తెలిసిన కొందరు వ్యక్తులు కడప మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు రంగంలోకి దిగి బాలికను రక్షించారు. బాలిక తల్లి, తండ్రితోపాటు రెడ్డయ్య, నాగరాజు అనే మరో వ్యక్తిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.