అవిశ్వాస తీర్మాన నాటకం ప్రధమాంకం ముగిసింది. ఎటూ వీగిపోతుందని ముందే తెలిసిన అవిశ్వాసానికి అంత మెచ్చుకోళ్లు ఎందుకో సగటు పౌరుడికి మాత్రం సందేహంగానే మిగిలిపోతుంది. విషయంలోకి వస్తే, రానున్న ఎన్నికలలో కేంద్రంలో ఉన్న భాజపాని నమ్మి మోసపోయామనే సానుభూతి ఓట్ల కోసం తెదేపా ఆడిన నాటకానికి తెరపడిందనే చెప్పవచ్చు.
మొన్నటిదాకా హోదాలు వద్దు, ప్యాకేజీలే ముద్దు అంటూ కాలం గడిపేసిన పెద్ద మనుషులు ఒక్కసారిగా నిద్రలేచి దీక్షలు, ధర్నాలు అవీఇవీ చేసేసి ఇక చివరి మాటగా తాము కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకి వ్యతిరేకులమనీ, కాబట్టే విగ్రహాలకు ఇచ్చినంత మొత్తం కూడా రాజధాని నిర్మాణానికి ఇవ్వలేదనే ముద్రతో మరో 10 నెలల్లో రానున్న ఎన్నికలకు వెళ్లాలనే ముందుచూపుతో అవిశ్వాస తీర్మానానికి కూడా వెళ్లి మమ అనిపించేసారు.
కాగా ఇందులో గల్లా జయదేవ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కడిగేసారని కొందరు, ఐదు కోట్ల మంది ఆంధ్రుల బాధని వెళ్లగక్కారనీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి అంతటివారు మెచ్చుకొనేసినంత మాత్రాన ఒరిగేది ఏముందో మాత్రం సగటు పౌరుడు ఇప్పటికీ బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు.