హిందూ పురాణాల పట్ల మీ పాలసీ ఏంటి? సీఎం జగన్ పైన RRR ప్రశ్నల వర్షం

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:34 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటన ఓ కుట్రలా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్‌ను, వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగలబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని నిలదీసారు.
 
సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు దేవాలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా, హిందూ దేవాలయాలు అంటే మీకు లెక్కలేదా, మీకు హిందూ పురాణాలు తెలియవు, అసలు మీ పాలసీ ఏంటని ప్రశ్నించారు.
 
ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మీ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పినవాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనబడుతున్నారా? రథం ఘటనపై దేవదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడం ఏంటని ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు