కిం.. కర్తవ్యం..? ఏం చెబుదాం..!?

మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (07:10 IST)
ఏపీ రాజధానిని ఎంత తొందరగా వీలైతే అంతతొందరగా అమరావతికి మార్చేయాలని ప్రభుత్వం ఆరాటపడుతోంది. అయితే ఇక్కడ స్థానికత సమస్య వారి ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. వివిధ శాఖలను ఇక్కడ నుంచి తరలించాలంటే ముందు ఉద్యోగుల నుంచి ఎదురయ్యే ప్రశ్న స్థానికత. దీనికి ఏం సమాధానం చెప్పాలి? వారిని ఎలా ఒప్పించాలి అనేది పెద్ద సమస్యగా మారింది. 
 
ఇదే అంశంపై ప్రభుత్వ కార్యదర్శుల మధ్య పెద్ద ఎత్తున చర్చ చోటు చేసుకొంది. హైదరాబాద్ నుంచి అమరావతికి మారితే, ఉద్యోగుల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎదురయ్యే స్థానికత సమస్య ప్రధానమైన అంశం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తారు. వారికి ఏం సమాధానం చెప్పాలి. రాజధానికి శాఖల తరలింపునకు సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్‌ ఆధ్వర్యంలో పలు శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వీలైనంత త్వరగా పరిపాలన అమరావతి నుంచి సాగించాలి. 
 
ఉద్యోగులను ఎలా ఒప్పించాలనే అంశంపై శాఖల కార్యదర్శలతో చర్చించారు. దశలవారీగా ఉద్యోగులను తరలించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో అక్కడకు తీసుకువెళ్లేందుకు అవసరమైన ప్రణాళికను శాఖలవారీగా రూపొందించుకోవాలని సూచించినట్లు తెలిసింది. మరోదైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా స్థానికతపై ప్రత్యేక ఉత్తర్వులను తీసుకువచ్చే అవకాశాలను కూడా పరిశీలించనున్నారు. మొదట జలవనరులు, విద్య, సంక్షేమం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, హోం, వ్యవసాయ సంబంధిత, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలు తరలింపు జాబితాలో ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి