కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ ప్రభావం తగ్గిన దేశాల్లో ఈ లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తూ వస్తున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్ సడలింపును సడలించే ముందు ఆయా దేశాలు కొన్ని సూచనలు, సలహాలను క్రమం తప్పకుండా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఇదే అంశంపై డబ్ల్యూహెచ్ఓ ఆరు ప్రమాణాలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేసింది.
వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నర్సింగ్ హోమ్స్ వంటి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, స్కూళ్లు, పని ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కొత్త నిబంధనలకు ప్రజలు అలవాటుపడే వరకు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది.
కొన్ని దేశాలు పలు వారాల పాటు సామాజిక, ఆర్థిక ఆంక్షలు భరించాయని, మరికొన్ని దేశాలు ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేయాలో పరిశీలిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ అన్నారు. అయితే, మానవ ఆరోగ్యం, వైరస్ స్పందనను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.