సీబిఐ విచారణకు లోకేష్ ఎందుకు భయపడుతున్నాడు?: మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:03 IST)
సీబిఐ విచారణకు లోకేష్ ఎందుకు భయపడుతున్నాడని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మంత్రి  అనిల్‌ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..

"నెల్లూరు జిల్లాకు చెందిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా వుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  నెల్లూరు జిల్లాలో గత ఏడాది వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల రెండో పంటకు ఎప్పుడూ లేనంతగా దిగుబడి వచ్చింది. సాధారణంగా పంట చేతికి వస్తున్న ఈ సీజన్‌లో జిల్లాలో ఎప్పుడూ వర్షాలు పడవు.

కానీ ఈ సారి వర్షాలు కురుస్తుండటం వల్ల ఇప్పటికే కోతకు వచ్చిన ధాన్యం తడిచిపోవడం, తేమశాతం పెరగడం, బ్రోకెన్‌ రైస్ శాతం ఎక్కువగా వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ తక్షణం స్పందించారు. నెల్లూరు రైతులను ఆదుకునేందుకు కూడా చర్యలు ప్రారంభించారు.
 
2)  ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 180 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతాంగానికి రూ.125 కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే మిల్లర్లు ధాన్యం నాణ్యత తగ్గిందని, నాణ్యత తక్కువగా వుందని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే వారితో కూడా మాట్లాడుతున్నాం.

రైతులు నష్టపోకూడదని మిల్లర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని ధాన్యం కొనుగోళ్ళను ముమ్మరం చేశాం. ప్రత్యేకంగా దీనిపై కేంద్రానికి లేఖ రాసి నెల రోజులు సేకరణకు సమయం కూడా తీసుకున్నాం. 3354 రకం ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేశారు. ఈ వర్షాలకు ధాన్యంలో తేమ 27-28 శాతం, బ్రోకెన్ ఎక్కువ వుందని మిల్లర్లు చెప్పారు. రైతులకు నష్టం జరగకూడాదని ఈ ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. రైతులు ఆందోళన చెందవద్దు.
 
3) నెల్లూరు జిల్లా రైతుల గురించి చంద్రబాబు ఆందోళన చెందడం విడ్డూరంగా వుంది. ఆయన అధికారంలో వున్న అయిదేళ్ళలో రైతుల గురించి పట్టించుకోలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు  ధాన్యం సేకరణ కోసం కేటాయించాల్సిన రూ.4వేల కోట్ల డబ్బును పసుపు-కుంకుమకు మళ్ళించాడు. ఇదేనా రైతుల పట్ల చంద్రబాబుకు వున్న చిత్తశుద్ది? ఇప్పుడు రైతులు ఇబ్బందుల్లో వున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తారా?

నెల్లూరు రైతులకు అన్యాయం జరుగుతోందని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు. గడిచిన అయిదేళ్ళు రైతుల గురించి పట్టించుకోకుండా మొద్దునిద్ర పోయింది చంద్రబాబే. ఈ రాష్ట్రంలోనే లేకుండా, ఈ రాష్ట్ర రైతుల గురించి మాట్లాడుతున్నాడు.
 
4) ఈ రాష్ట్రంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం. పొగాకు నుంచి అనేక పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోతే నేరుగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించింది ముఖ్యమంత్రి వైయస్ జగన్.

రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోళ్ళను కూడా గ్రామస్థాయిలోనే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇది. ఫాం మెకనైజేషన్ పేరుతో యంత్రాలను కూడా సమకూరుస్తోంది. అటువంటి ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడం హాస్యాస్పదం.
 
5) ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా వుంటే, ప్రకృతి, భగవంతుడు కూడా సహకరిస్తాడు. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. ఎన్నడూ నీళ్ళు చూడని రిజర్వాయర్‌లు కూడా నిండుగా కళకళలాడుతున్నాయి. అన్ని డ్యాంలు నిండాయి. గత ఏడాది కోటి ఎకరాలు సాగులోకి వచ్చింది, ఈ ఏడాది అంతకన్నా ఎక్కువగానే సాగు జరుగుతుందని భావిస్తున్నాం. 
 
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
6) అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ,  ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసింది. వేల ఎకరాలు ల్యాండ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఈ కమిటీలు గుర్తించాయి. టిడిపి పెద్దలు రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని సీబిఐకి కూడా ఇచ్చాం. దానిని వారు స్టడీ చేసి చర్యలు తీసుకుంటారు. దీనికి కొంతసమయం పడుతుంది.
 
7) గత ప్రభుత్వంలో జరిగిన పలు అవినీతి  అంశాలపై సీబిఐ విచారణ జరుగుతోందంటే.. ఎందుకు లోకేష్ భయపడుతున్నాడు? సీబిఐ విచారణను ఆహ్వానిస్తున్నామని లోకేష్ లేఖ రాయాలి. టీడీపీ హయాంలో సీబిఐని రాష్ట్రానికి రానివ్వమని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై సీబిఐ విచారణ కోరుతున్నాం.

మమ్మల్ని జైలుకు పంపించాలని ఎవరైతే బలంగా కోరుకున్నారో.. ఈరోజు వారికి అదే ప్రాప్తిస్తుంది. అమరావతి రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబు, లోకేష్.. ఇలా ఎవరెవరు ఈ స్కాంలో వున్నారో సీబిఐ తేలుస్తుంది. తప్పు చేసిన వారే కంగారు పడుతున్నారు" అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు