మంగళగిరిని కోవిడ్ కోరల్లోంచి రక్షించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. గురువారం రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇవి...
కోవిడ్ బారిన పడి ధైర్యంతో ఎదుర్కొని మరీ విధులకు హాజరవుతున్న కలెక్టర్ గారు వైరస్ కట్టడికి కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో స్ఫూర్తి నింపారని, సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్న కలెక్టర్ గారిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రమాదకరస్థాయిలో వుందని, దీని కట్టడికి చర్యలు తీసుకోవాలని తొమ్మిది అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
1) కోవిడ్ సెంటర్లలో పేషెంట్లకు భోజనం కోసం ప్రభుత్వం 500 రూపాయలు వెచ్చిస్తున్నా, మంగళగిరి నియోజకవర్గంలో పేషెంట్లకు మెరుగైన భోజనం, వసతి అందడంలేదు. దీనివల్ల వైరస్ నుంచి కోలుకునే రికవరీ రేటు చాలా తక్కువగా వుంది.
2) కరోనా నుంచి కోలుకున్న రోగులకు ప్రభుత్వం అందించే రూ.2000 సాయం ఏ ఒక్క పేషెంట్‌కి అందడంలేదు.
3) పాజిటివ్ అని తేలితే వారిని కోవిడ్ సెంటర్లకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ కోసం ప్రతీ ఒక్క పేషెంట్‌పై రూ.300 వెచ్చిస్తున్నామని చెబుతున్నా, మంగళగిరిలో కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లు తామే వాహనాలు సమకూర్చుకుని కోవిడ్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది.
5) వాలంటీర్ల వల్లే కోవిడ్ కట్టడి చేయగలిగామని గొప్పగా చెబుతున్నారని, అయితే మంగళగిరిలో కోవిడ్ వైరస్ సోకిన వారిని గుర్తించడంలో వాలంటీర్లు విఫలం అవ్వడం వల్లనే ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందింది.
7) ప్రతీ ఒక్కరికీ మూడు మాస్కులందించామని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తోంది. అయితే మంగళగిరిలో వైరస్ వ్యాప్తి ఇంత తీవ్రంగా వున్నా..ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఒక్క మాస్కూ అందలేదు.
8) హోం క్వారంటైన్‌లో వున్నవారి ఇంటి దగ్గరకే నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. వాస్తవ పరిస్థితి చూస్తే.. క్వారంటైన్ నుంచి బయటకు రాలేక, నిత్యావసరాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
9) మంగళగిరిలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వుండటం, కంటైన్మెంట్ జోన్లు వుండటం వల్ల ఆ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా వుందని, కాలువల్లో మురుగు కూడా తీయడంలేదు.
ఈ సమస్యలన్నీ సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి రాసిన లేఖలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు.