ప్రియుడితో భర్తను చంపించాలని ప్లాన్ వేసిన భార్య, పరార్

శుక్రవారం, 5 జూన్ 2020 (18:18 IST)
వారిద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. భర్త ఆటోడ్రైవర్. ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇద్దరు పిల్లలు. అన్యోన్యమైన కుటుంబం. అయితే ఆ కుటుంబాన్ని అక్రమ సంబంధం చిన్నాభిన్నం చేసింది. ఇంటి పక్కనే ఉన్న యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం కాస్త భర్త హత్యకు స్కెచ్ వేసే వరకు వెళ్ళింది.
 
తిరుపతి రూరల్ మండలం వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన శివ, కుమారికి నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆటో నడుపుతున్న శివకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే గత నెలరోజుల నుంచి ఇంటి పక్కనే ఉన్న ఖాదర్ అనే యువకుడితో కుమారి అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఆ విషయం తెలుసు. అయితే అంకుల్ అంకుల్ అంటూ ఆ యువకుడు వెంట తిప్పుకుని వారికి చాక్కెట్లు, బిస్కెట్లు కొనిచ్చేవాడు. ఇంటి పక్కనే కదా అని మొదట్లో భర్తకు అనుమానం రాలేదు. అయితే గత 15 రోజుల క్రితం ఆ యువకుడు తన భార్య కలిసి ఉండటాన్ని కళ్ళారా చూశాడు శివ.
 
భార్యను మందలించాడు. కుటుంబంలో కలతలు తీసుకురావద్దని, ఇప్పటితో వదిలేయమని ప్రాధేయపడ్డాడు. అయితే భార్య ఒప్పుకోలేదు. భర్తను ఎలాగైనా చంపించాలని స్కెచ్ వేసింది. 10 రోజుల క్రితం లారీతో ఆటోను గుద్దించి చంపించేందుకు యత్నించింది. కానీ ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇదంతా ప్రియుడు తన స్నేహితులతో చేయిస్తున్న పనులని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
అయితే ఆటో డ్రైవర్ కావడంతో ఎవరో స్నేహితులు ఇలా చేసి ఉంటారని పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ నిన్న ఉదయం ఆటో తీసుకుని ఇంటి నుంచి తిరుపతి వైపు వస్తున్న శివను మార్గమధ్యంలో కొంతమంది యువకులు అటకాయించారు. అతన్ని చితకబాదారు. ఐదుగురు యువకుల నుంచి ఎలాగోలా తప్పించుకుని నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు బాధితుడు. 
 
శివను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య కుమారి పరారీలో ఉంది. ప్రియుడితో పాటు అతనికి సహకరించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు