అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ పట్ల సాక్షాత్ ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వేధింపులకు పాల్పడినట్టు ప్రచారం సాగుతోంది. ఈ వివాదం పెద్దది కావడంతో పార్టీ ఎంపీ, ఇతర సీనియర్ నేతలు జోక్యం చేసుకుని బాధితురాలితో పాటు ఆమె భర్తను కూడా బుజ్జగించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ ఒకటో పట్టణానికి చెందిన ఓ టీడీపీ మహిళా కార్పొరేటర్ తన డివిజన్ సమస్యల గురించి ఆ పార్టీ సీనియర్ నేతకు చెప్పింది. తన వద్దకు పర్సనల్‌గా వచ్చి చర్చించాలని సూచించాడు. దీంతో ఆయన వద్దకు వెళ్లిన ఆమెను అసభ్య పదజాలంతో సంభోదిస్తూ.. చాలా అందంగా ఉన్నావంటూ వెకిలి చేష్టలకు పాల్పడినట్టు వినికిడి. పైకి ఎంతో హుందాగా కనపడే ఆ నాయకుడు ఇలా వ్యవహరించడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో అక్కడ నుంచి బయటకు వచ్చి జరిగిన విషయం సన్నిహితులకు చెప్పింది. దీంతో వారంతా నివ్వెరపోయారు.
ఈ అసభ్య ప్రవర్తన విషయం తెలుసుకున్న ఆమె భర్త మరి కొంతమంది కార్యకర్తలు ఆ నాయకుడిని చొక్కా పట్టుకుని నాలుగు తగిలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయం ఎంపీ కార్యాలయానికి చేరడంతో కార్యాలయ ప్రతినిధులు ఆ మహిళా ప్రతినిధి, ఆమె భర్తను పిలిపించి బుజ్జగించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సర్ధి చెప్పారు. పార్టీ పరువు రోడ్డున పడుతుందని, ప్రజల్లో చులకనైపోతుందంటూ అర్బన్ పార్టీ నేతలు కొందరు బతిమలాడటంతో వివాదాన్ని ముగించారు.