మంగళగిరిలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి.. యువతి గ్యాంగ్‌పై రేప్...

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:15 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ఓ భాగమైన మంగళగిరిలో దారుణం జరిగింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లికి చెందిన చుంచు శ్రీనివాస్ (26), అంగడి జ్యోతి (24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. 
 
వారిద్దరూ అక్కడ ఏకాంతంగా ఉన్నారు. రాత్రి 9 గంటల సమయంలో వీరిద్దరినీ గమనించిన ముగ్గురు దుండగులు వారిపై ఇనుప రాడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత జ్యోతిపై ప్రియుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. అయితే, ఆ దండుగల నుంచి తప్పించుకునేందుకు జ్యోతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై కూడా దాడిచేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయలపాలైంది. 
 
రక్తపుమడుగులో పడివున్న జంటను చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. యువతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందగా, యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు