తెలంగాణలో మద్యంషాపుల కోసం మహిళల పోటీ

శనివారం, 19 అక్టోబరు 2019 (19:53 IST)
తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. వైన్‌షాపులు దక్కించుకోవడానికి ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారులు పోటీ పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 216 వైన్‌ షాపులకు 48వేల 385పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దాదాపు మూడు వేల మంది మహిళలు ఉన్నారు. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి మద్యం షాపులను కేటాయించారు. నిజామాబాద్‌ జిల్లాలో లక్కీ డిప్‌ ద్వారా వైన్‌ షాపులను కేటాయించారు.

ఈ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ రాంమోహన్ రావు, జేసీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 మద్యం షాపులకు గాను 1072 దరఖాస్తులు వచ్చాయి.
 
మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 167మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాలులో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ ఆధ్వర్యంలో లాటరీ డిప్‌ ద్వారా మద్యం షాపులను కేటాయించారు. అందరి సమక్షంలో లాటరీ డిప్‌ ద్వారా మద్యం షాప్‌ టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు కలెక్టర్.
 
ఉమ్మడి ఖమ్మం జిల్లా మద్యం డ్రాలో మహిళల హడావుడి ఎక్కువగా కనిపించింది. మొత్తం 8 వేల దరఖాస్తులలో నలభై శాతం మహిళలవే. అశ్చర్యకరంగా లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారిలో కూడా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు.
 
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 56 మద్యం షాపులకు నగరంలోని మయూరి గార్డెన్స్‌లో కలెక్టర్‌ హరిత ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. మొత్తం 1768 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా గిర్నిబావి షాపుకు 112మంది దరఖాస్తు చేయడం జరిగిందని వరంగల్‌ శ్రీనివాసరావు తెలిపారు.

అలాగే వరంగల్‌ అర్భన్‌ జిల్లాలో మద్యం టెండర్ల లక్కీ డ్రాను కలెక్టర్ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ప్రారంభించారు. జిల్లాలో 59మద్యం షాపులకు లాటరీ డిప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి దుకాణాలను కేటాయించారు.
 
మహబూబాబాద్‌ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా టెండర్‌దారులకు షాపులను కేటాయించారు జిల్లా కలెక్టర్ శివలింగయ్య. పోలీసుల భారీ బందోబస్త్ మధ్య డ్రా తీశారు. 52మద్యం దుకాణాలకు 1531 దరఖాస్తులు వచ్చాయి.

పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా మద్య దుకాణాల లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు ఆయా జిల్లా అధికారులు. అందరి సమక్షంలోనే లాటరీ డిప్‌ ద్వారా మద్యం షాప్‌ టెండకర్ల ప్రక్రియ జరిగిందన్నారు.
 
నిజామాబాద్ జిల్లాలో 90 లిక్కర్ షాపులకు 1072 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 85 మంది మహిళలు కూడా మద్యం షాపుల కోసం పోటీపడ్డారు. కలెక్టర్ రామ్మోహన్ రావు లక్కీ డ్రా ద్వారా లిక్కర్ షాపులను కేటాయించారు. షాపులను ఆదక్కించుకున్న వారిలో మహిళలు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు