సెలెక్ట్ కమిటీలోనూ చక్రం తిప్పుతాం.. ఎందుకంటే.. : యనమల కామెంట్స్

గురువారం, 23 జనవరి 2020 (12:15 IST)
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ బుధవారం రాత్రి సూచించారు. ఛైర్మన్ నిర్ణయంతో ప్రభుత్వం షాక్‌కు గురైంది. మూడు రాజధానుల అంశంపై తదుపరి ఏం చేయాలన్న అంశంపై ఇపుడు తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత  తాజా పరిణామాలపై మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. 
 
రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపినందున ఆ నివేదిక వచ్చేవరకు ప్రభుత్వానికి వేచి చూడడం తప్ప మరో మార్గం లేదన్నారు. అలాగే, ఆర్డినెన్స్‌ జారీ అసలు కుదరదన్నారు. ఇందుకు కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చన్నారు. అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. 
 
ఎందుకంటే సెలెక్ట్‌ కమిటీ ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయిస్తే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుందన్నారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లాక ఆర్డినెన్స్‌ తేవడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇక మేము కోరింది మండలి సెలెక్ట్‌ కమిటీనే తప్ప జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీని కాదని, అందువల్ల కమిటీలో టీడీపీ సభ్యులే ఎక్కువ మంది ఉంటారని, ఆ సెలెక్ట్ కమిటీలోనూ చక్రం తిప్పి రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటామని యనమల చెప్పారు. 
 
ఒకవేళ ప్రభుత్వం మరింత పట్టుదలకు పోయి శాసనమండలిని రద్దు చేసినా తమకొచ్చే నష్టమేమీ లేనద్నారు. పైగా, మండలి రద్దు అంత సులభమైన పనికాదన్నారు. ఎందకంటే... మండలిని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, ఆ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ఆ పిమ్మట రాష్ట్రపతికి పంపించి నోటిఫికేషన్ జారీ చేయాల్సివుంటుంది. ఇది ఇప్పట్లో జరిగేపనికాదని, అందువల్ల ఆంధ్రుల రాజధాని అమరావతేనని ఆయన స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు