'మూడు ముక్కలాట'కు శాసనమండలి తాత్కాలిక బ్రేక్

గురువారం, 23 జనవరి 2020 (06:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టుకు ఏపీ శాసనమండలి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. దీంతో రాజధాని తరలింపు అంశం ఇప్పట్లో లేనట్టేనని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ
చట్టం రద్దు బిల్లులపై మండలిలో వాడివేడి చర్చలు జరిగిన విషయం తెల్సిందే. 
 
బుధవారం రాత్రి వరకు అత్యంత ఉత్కంఠ మధ్య ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ బిల్లు సెలెక్ట్ కమిటీ బాట పట్టేలా మార్గం సుగమం చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు వైసీపీ మంత్రులు, సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. శాసనమండలి ఛైర్మన్ పోడియంను చుట్టి ముట్టారు. ఎట్టకేలకు ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో టీడీపీ పైచేయి సాధించింది. 
 
ముఖ్యంగా ఈ బిల్లు విషయంలో వైకాపా మంత్రుల వ్యూహాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గంటన్నర పాటు శాసనమండలి గ్యాలరీలోనే ఉన్నారు. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఛాంబర్‌కు వెళ్దామని టీడీపీ ఎమ్మెల్యేలు సూచించినా చంద్రబాబు అక్కడికి వెళ్లేది లేదంటూ చివరివరకూ మండలిలోనే ఉంటానని అక్కడే కూర్చున్నారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీంతో తెదేపాతో పాటు.. రాజధాని ప్రాంత రైతులు సంబరాలు చేసుకుంది. షరీఫ్ నిర్ణయం వైకాపా సర్కారుకు చెంపపెట్టులా మారింది. 
 
మరోవైపు, రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఏపీ శాసనమండలి సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా, అధికార పక్ష సభ్యులు మాత్రం నిరసన తెలిపారు. దీంతో, శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో నిరవధిక వాయిదా వేస్తున్నట్టు షరీఫ్ ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు