ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ సభ్యలు అసెంబ్లీలో రాద్దాంతం సృష్టిస్తున్నారు. పలు చోట్ల ఆందోళనలకు దిగారు. మరోవైపు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సొంంత పార్టీ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారిలో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్ఆర్ పేరు పెట్టడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించి ఆ స్థానంలో వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని మాత్రం తాను అంగీకరించబోనని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందన్నారు. అలాంటి టీడీపీతో చంద్రబాబు చేతుల కలపడాన్ని తాను జీర్ణించుకోలేక పోయినట్టు చెప్పారు. పైగా, ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకునిరాలేదని, చంద్రబాబు మాత్రం తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. పైగా, ఎన్టీఆర్‌కు అప్పటి ప్రధాని వాజ్‌పేయి భారత రత్న ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు.