తిరుపతి ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని, టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ, జిల్లా ఎస్పీలు క్రిమినల్ ముఠాగా ఏర్పడ్డారని, వారిపై చర్యలు తీసుకునే ధైరంయ చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వున్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైయస్ఆర్ సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని ఆరోపించారు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అంతర్జాతీయంగా తిరుమల తిరుపతి ఆలయానికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ప్రపంచం దీనిని గమనిస్తుంది. అటువంటి క్షేత్రంలో ప్రణాళికా లోపం కారణంగా వైకుంఠ ద్వార దర్శనంకు వచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మృతి చెందడం చాలా పెద్ద ఘటనగా భావించాలి. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. డీఎస్సీ, గోశాల డైరెక్టర్ లను సస్పెండ్ చేయడంతో చేతులు దులుపుకున్నారు.
తిరుపతిలో తొక్కిసలాట సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, హోం, రెవన్యూ, ఎండోమెంట్ మంత్రులతో కలిసి ఘటనా స్థలికి వెళ్ళి అధికారులు, మృతుల కుటుంబాలు, క్షతగాత్రులతో మాట్లాడారు. దీనిపై చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ సీఎం మాత్రం తన అనుకూల అధికారులుగా, కావాలని తిరుమల తిరుపతిలో పోస్టింగ్ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆ నలుగురిపై ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు చంద్రబాబు ఈ ఘటనపై హుటాహుటిన తిరుపతికి వెళ్ళింది బాధితులు, భక్తుల కోసం కాదు. తను పెంచి పోషిస్తున్న క్రిమినల్ ముఠాలోని నలుగురిని కాపాడుకునేందుకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నలుగురూ వైయస్ఆర్ సీపీకి చెందిన వారిపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలా అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ థర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కేసుల్లో ఎలా ఇరికించాలా అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందీ, ఇవే లడ్డూలను అయోధ్యలోని రామాలయంకు కూడా పంపారంటూ అత్యంత దారుణమైన తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు.
పిల్లి బాబూరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై మాపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. దీనిపై ఎల్లో మీడియాలో అంబటి సోదరులపై క్రిమినల్ కేసు అంటూ పెద్ద కథనాలను ప్రచురించారు. పిల్లి బాబూరావు నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి సమాచారం తెలియగానే డీఎస్సీ, సీఐలతో మాట్లాడాను. ఈ కేసులో ఎప్పుడు మీరు విచారణకు పిలిచినా హాజరవుతాను, లేదా అరెస్ట్ చేసేందుకు వస్తామన్నా కూడా పూర్తిగా సహకరిస్తాను అని చెప్పాను. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాను. బాద్యుడైన పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తాను. దీనిపై భయంతో క్వాష్ కు, యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నించను. చంద్రబాబు, లోకేష్ లు చెప్పారని అర్థరాత్రి పూట వచ్చి మా తలుపులు కొట్టవద్దు. ఎప్పుడ రమ్మని ఫోన్ చేసినా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఇటువంటి తప్పుడు కేసులను భయపడేది లేదు. పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు.