రూట్ క్లియర్ చేస్తున్న చంద్రబాబు... ఆ ముగ్గురితో విజయసాయి విందు

శుక్రవారం, 21 జూన్ 2019 (16:06 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై వైకాపా రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని పేర్కొంటూ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు... ఇపుడు మళ్ళీ ఆ పార్టీలో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారని మండిపడ్డారు. 
 
ఇందులోభాగంగానే ఆయన టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించారని విజయసాయి ఆరోపించారు. తద్వారా రూట్ క్లియర్ చేసుకుంటున్నారన్నారు. రూ.లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నారు. 
 
తెలుగుదేశం పార్టీని ఓడించినందుకే కర్నూలు జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆర్నెల్ల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. కానీ, జగన్ మాత్రం ప్రజలంతా నావారే, ఎవరి పట్ల వివక్ష ఉండదని చెప్పారని... చంద్రబాబుకు, జగన్‌కు మధ్య ఉన్న తేడా ఇదేనని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చేసిన ట్వీట్లు ఆసక్తిని కల్పిస్తున్నాయి.
 
మరోవైపు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యులకు ఇచ్చిన విందులో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీల్లో ముగ్గురు అంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లతో కలిసి విజయసాయి రెడ్డి విందు ఆరగించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ ఫోటోల కింద నెటిజన్లు తమకుతోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా, విపక్షం బలహీనంగా ఉండాలన్న లక్ష్యంతోనే టీడీపీ నేతలను బీజేపీలోకి వెళ్లేలా విజయసాయి రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు