ఎమ్మెల్యే ఆనంకు అవమానం.. వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా రాంకుమార్ రెడ్డి

బుధవారం, 4 జనవరి 2023 (11:02 IST)
ఏపీలోని సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. వైకాపా ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపినందుకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతలను మరో నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగిస్తూ వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకలాపాలన్నీ ఇకపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతాయన్నది ఆ ప్రకటన ద్వారా చెప్పారు. 
 
అయితే, ఈ మార్పుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అదేసమయంలో ఆయన తదుపరి చర్యలు, నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, గత కొన్ని రోజులుగా ఆనం రామ నారాయణ రెడ్డి అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమ పార్టీ ముందస్తు ఎన్నికలకంటూ వెళితే ఒక యేడాది ముందుగానే ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు.
 
పైగా, పింఛన్లు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై వేచిచూసే ధోరణిని వైకాపా పెద్దలు అవలంభించారు. అయితే, ఆయన వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఆయనపై చర్యకు ఉపక్రమించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు