యస్‌ బ్యాంకు మూలాలు చంద్రబాబు దగ్గర: పేర్ని నాని

మంగళవారం, 10 మార్చి 2020 (07:56 IST)
యస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో కలిసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. యస్‌ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు నాయుడు దగ్గర తేలుతున్నాయని వ్యాఖ్యానించారు.

పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..  కరకట్ట మీద ఉన్న బాబు నివాసంలో రాణా కపూర్‌ ఒకరోజు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘దేశంలో ఎక్కడ ఆర్థిక అవకతవకలు జరిగినా విజయవాడ కరకట్ట మీద అక్రమ బంగళాలో తేలుతుంది.

రాణా కపూర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నది కరకట్టకు లింక్ అవుతోంది. చంద్రబాబు దోచుకున్న సొమ్ము కాంగ్రెస్ పార్టీకి హవాలా రూపంలో పంపారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి చెందిన రూ.1300 కోట్లు యస్‌ బ్యాకులో డిపాజిట్‌ చేశారు.

అంతేకాక ఢిల్లీలో యస్‌ బ్యాంక్‌తో కలిసి పారిశ్రామిక సదస్సు నిర్వహించారు. రాణా కపూర్‌తో కలిసి హవాలా వ్యాపారం చేసిన బాబు.. తన హవాలా సొమ్మును యస్ బ్యాంక్ ద్వారా విదేశాలకు మళ్లించారు. దీనిపై ఈడీ పూర్తిస్థాయిలో విచారణ జరపాలి’ అని కోరారు.

పవన్‌.. ఏంటీ గోల?
‘చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. బీసీలు జడ్జీలుగా పనికి రారని లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్లు సైతం అడ్డుకున్నారు. 10 శాతం బీసీల రిజర్వేషన్లు పార్టీ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తాననగానే బాబు కూడా ఇస్తానంటున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో సీఎం వైఎస్‌ జగన్‌ 60 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు స్థానం కల్పించారు. సీఎం జగన్‌ బాగా పరిపాలన చేస్తే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు తీసుకుంటానన్నాడు.

మరి సినిమాలు తీసుకోకుండా ఈ మేనిఫెస్టో గోల ఏమిటి? బాబు గురించి మళ్లీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారా? పవన్‌ ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలి’ అని పేర్ని నాని హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు