వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి. ఈయన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. అపుడు ఒక ముఖ్యమంత్రి తనయుడుగా ఆయన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నగరం నుంచి సీఎం తనయుడుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి అడుగు బయటపెట్టాడు. కానీ, ఇపుడు నవ్యాంధ్ర సీఎంగా ఆయన తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఇదంతా కాకతాళీయం కాదు.. మనం కనులారా చూస్తున్న వాస్తవం.
ఆ తర్వాత పార్టీ పెట్టటం... ఐదేళ్లు ప్రతిపక్షం.. విభజన తర్వాత ఏపీకి కాబోయే రెండో సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సింది గవర్నర్ నరసింహన్‌ను కలిసి వైఎస్ఆర్ ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం, ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా ప్రగతిభవన్‌లో జగన్ కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అన్నింటి కంటే క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ఔట్ - ఇన్ అంశం అందరూ ఆసక్తిగా చర్చించుకోవటం జరిగింది. ఎంతలో ఎంత మార్పు.. అప్పటి జగన్ - ఇప్పటి జగన్.. కసితో పోరాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు అంటూ అభిమానులు అంటున్నారు.