చంద్రబాబు ముఖారవిందాన్ని చూసి అవి రావు... జగన్ మోహన్ రెడ్డి

మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:52 IST)
ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న 10వ యువభేరిలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఖచ్చితంగా అవసరం. అనంతపురం జిల్లా నుంచి ఏటా మూడు నాలుగు లక్షల మంది వలసపోతున్నారు. 
 
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న జిల్లాల్లో అనంతపురం అగ్రస్థానంలో వుంది. మూడున్నరేళ్ల సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఇది అనంతపురం వరకు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ అదే తీరు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఎవరికైనా జాబు వచ్చిందా... చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కడయినా నెరవేరాయా... ఈనాడు పేపరులో ఆయన చెప్పిన మాటలను చూపిస్తున్నా. సాక్షి పేపరు చూపిస్తే మళ్లీ సాక్షి అని అంటారు. చంద్రబాబు నాయుడు ముఖారవిందాన్నో లేదంటే జగన్ మోహన్ రెడ్డి ముఖాన్నో చూసి కంపెనీలు రావు. రాయితీలను చూసి మాత్రమే వస్తాయి.
 
నాలుగు సంవత్సరాలు కావస్తున్నా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. పైగా ప్రత్యేక హోదా ఏమయినా సంజీవినా అని ప్రశ్నిస్తున్నారు. హోదా సాధించాల్సిందిపోయి దాన్ని పక్కన పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది కాబట్టి ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. కానీ ఎన్నికలు ముగిశాక ప్లేటు ఫిరాయించారు. ఎన్నికల సమయంలో ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ అన్నారు. 
 
మరి వారు ఇచ్చిన మాటలను నెరవేర్చరా... ప్రత్యేక హోదా సాధించేవరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు అంటూ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇంకా సభలో పలువురు విద్యార్థులు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు