త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ బహిష్కరించనున్నట్టు ప్రకటించింది. వైకాపా నుంచి టీడీపీలో చేరి మంత్రిపదవుల్లో ఉన్న ఆ నలుగురిని తక్షణం బర్తరఫ్ చేయాలని, అప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకారాదనీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన వైకాపా సమావేశంలో తీర్మానించిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు జగన్ ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అభివృద్ధి, పరిపాలనను పక్కనబెట్టి, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు, బాధ్యతలను మరచి అప్రజాస్వామిక చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఈ లేఖలో జగన్ ఆరోపించారు.
తమ పార్టీ టికెట్‌పై గెలిచిన వారిని తెలుగుదేశంలో చేర్చుకున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలన్న తమ డిమాండ్‌పై స్పీకర్ చర్య తీసుకోకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వైకాపా తరపున ఎంపికైన ఎమ్మెల్యేలను తన పక్కన చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చారని గుర్తు చేసిన జగన్, చంద్రబాబు వైఖరికి నిరసనగా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని కోవింద్‌కు రాసిన లేఖలో కోరారు.