జగన్ పాదయాత్ర వాయిదా... 6 నుంచి ప్రారంభం

మంగళవారం, 24 అక్టోబరు 2017 (11:25 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టదలచిన పాదయాత్ర మరోమారు వాయిదాపడింది. ఏపీలో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు. అయితే, ఆయనకు కోర్టులో చుక్కెదురు కావడంతో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. 
 
అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో, నవంబర్ 2 నుంచి పాదయాత్రను తలపెట్టిన జగన్ దాన్ని మరోసారి వాయిదా వేశారు. నవంబర్ 3 శుక్రవారం కావడం, ఆ రోజు కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో, 6వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. 
 
కోర్టు కేసు విచారణ కారణంగానే రెండో రోజు యాత్రను ఆపడం ఇష్టం లేని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కనీసం మూడు రోజుల పాటు నిర్విఘ్నంగా పాదయాత్ర చేయాలన్న తలంపులో ఆయన ఉన్నారు. అంటే 6వ తేదీ నుంచి 10 వరకూ యాత్ర చేసి, ఆపై 11న కోర్టు విచారణకు రానున్నారు. ఈలోగా హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందాలని కూడా జగన్ తరఫు న్యాయవాదలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు