వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో భాగంగా, గవర్నర్ అబ్దుర్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జగన్‌తో కలుపుకుని మొత్తం 11 మంది సభ్యులు సభలో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీరు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చింది 11 నిమిషాల కోసమా? అంటూ నిలదీశారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజరు కోసం సభకు వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
అలాగే, గవర్నర్ ప్రసంగంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఆయన ప్రసంగంలో ఎలాంటి పస లేదని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.