వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో మిస్టరీని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వివేకానంద రెడ్డి హత్యకు దారితీసిన కారణాలను వారు తెలుసుకున్నారు.
ముఖ్యంగా, వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఓ భూ కేసులో వివేకానంద రెడ్డి - పరమేశ్వర్ రెడ్డిల మధ్య నెల రోజుల క్రితం గొడవ జరిగినట్టు సమాచారం. ఈ భూ సెటిల్‌మెంట్ కేసులో వివేకానంద రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఫలితంగా పరమేశ్వర్ రెడ్డి ఆయనపై కోపగించుకుని, మట్టుబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇందులోభాగంగా, వివేకానంద రెడ్డి హత్యకు నెల రోజులుగా రెక్కీ నిర్వహించారు. తొలుత వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లోని పెంపుడు కుక్క ఒకటి అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ తర్వాత అజ్ఞాత వ్యక్తి నుంచి వివేకా మొబైల్‌కు బికేర్‌ఫుల్ అంటూ ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. అయినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆయన తలపై, మెడపై, నుదుటి భాగంలో గొడ్డలి వేట్లు ఉన్నాయి. బాత్రూమ్‌కు వెళ్లిన వివేకాను గొడ్డలితో నరికి చంపేశారు.
మొత్తంమీద వైఎస్. వివేకానంద రెడ్డికి పరమేశ్వర్ రెడ్డికి మధ్య భూవివాదం కేసులో ఏర్పడిన మనస్పర్థలే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నాయి. ఇందులోభాగంగా, తొలుత కుక్కను చంపిన దుండగులు.. ఆ తర్వాత వివేకాను మట్టుబెట్టివుంటారని సిట్ అధికారులు నమ్ముతున్నారు.