వైఎస్సార్ బీమా స్కీమ్.. అర్హతలేంటి? ఎలా డబ్బులొస్తాయ్?
బుధవారం, 8 జూన్ 2022 (20:26 IST)
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫథకాల్లో వైఎస్సార్ బీమా స్కీమ్ కూడా ఒకటి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే విధంగా జగన్ సర్కార్ ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
పేదలు, అసంఘటిత కార్మిక కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం బీమా ప్రీమియం ఖర్చును భరిస్తుంది. వైఎస్సార్ బీమా పథకంలో చేరిన వారికి ఒక గుర్తింపు కార్డు లభిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, పాలసీ నెంబర్ వంటివి ఉంటాయి.
గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. కాగా పథకానికి సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేసుకునేందుకు 155214 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారు. వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి అర్హత కలిగిన వారిని ఈ స్కీమ్‌లో నమోదు చేయిస్తారు.
కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదవశాత్తు మరణించినా బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు.
వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకోవడం వల్ల ప్రమాదవశాత్తు లేదంటే సహజ మరణం పొందితే బీమా లభిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే.. అప్పుడు వారి కుటుంబానికి రూ. లక్ష చెల్లిస్తారు.
అలాగే 18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు ప్రమాదంలో మరణించినా లేదంటే అంగవైలక్యం సంభవించినా రూ. 5 లక్షల వరకు లభిస్తాయి.
బీమా మొత్తం బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ అవుతుంది. బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా డబ్బులు వస్తాయి. లబ్ధిదారుడి కుటుంబానికి తక్షణ ఉపశమనం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తారు.