జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రాష్ట్ర పర్యటన కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనం రంగుపై వైకాపా నేతలు విమర్శలు గుప్పించడాన్ని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి ఆపై హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న మీరా మాతో మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైకాపా నేతలకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
జనసేన ఎపుడూ చట్టానికి వ్యతిరేకంగా పని చేయదన్నారు. ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందన్నారు. విజయనగరం జిల్లా జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళ్తే తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. బీసీ గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ఆర్టీసీగా మార్చివేశారని ఆరోపించారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని సర్పంచ్‌లు పోరాడుతుంటే వారి చెక్ పవర్ లాగేసుకున్న ఘనత వైకాపా పాలకులకే ఉందన్నారు.