ఏపీలో వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు ప్రారంభం

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:27 IST)
గుంటూరు కలెక్టరేట్లో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొనడం జరిగింది. అర్హులైన రబీ రైతులందరికీ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వారి వారి ఖాతాల్లో మంగళవారం నగదు జమ చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా అధికారులు నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా వ్యవసాయధికారి, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ వడ్డీ లేని రుణాల పథకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేసారన్నారు. దాదాపు 6 లక్షల 28 వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 
 
రబీ సీజన్‌లో లక్ష లోపు పంటరుణాలు తీసుకొని ఏడాది లోపు చెల్లించిన రైతులకు ఈ పథకం కింద నగదు జమ అవుతుందన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద దాదాపు 128 కోట్ల రూపాయలు జమ కానున్నాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని సీఎం గారు చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు