కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివుంటానని, పైగా, తాను పిరికిపందలా పారిపోనని అందువల్ల ఎపుడైనా వచ్చి అరెస్టు చేసుకోవచ్చని కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘం కూడా నల్లపురెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాగే ఆయనపై కేసు కూడా నమోదైంది.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మాట్లాడుతూ, నాని నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి రక్తం. భయపడే అనేది మా బయోడేటాలోనే లేదు అన్నారు. తాను పారిపోయానంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కావాలంటే తనను ఇపుడే అరెస్టు చేసుకోవచ్చంటుూ పోలీసులకు ఆయన సవాల్ విసిరారు.
నేను నెల్లూరు వదిలి పారిపోయానని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను. నన్ను అరెస్టు చేసుకోవచ్చు అని ఆయన అన్నారు. అలాగే, నెల్లూరులోని తమ ఇంటిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని ఆ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.