తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్, వదిన భారతీ రెడ్డిలను కలిసి, తన కుమారుడు వివాహానికి హాజరుకావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం వద్ద షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, ఠరాజేశేఖర్ రెడ్డిగారి మనవడు పెళ్లికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను ఆహ్వానించా. వారు సానుకూలంగా స్పందించారు" అని చెప్పారు.
కాగా, వైఎస్ షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. అయితే, షర్మిల కాన్వాయ్ వెళ్లిన కాసేపటికి ఆయన వాహనం క్యాంపు ఆఫీసుకు రావడంతో పోలీసులు ఆయనను సీఎం నివాసం వైపు వెళ్ళకుండా నిలిపివేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి పంపించారు. గన్నవరం నుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో తన వాహన చిక్కుకునిపోవడంతో షర్మిల వెంట రాలేకపోయానని ఆయన చెప్పారు.