వరంగల్ జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలపై యాసిడ్ పోసిన నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖ చర్యను వారు అభినందిస్తున్నారు. గత డిసెంబర్ నెలలో పాఠశాల విద్యార్థిని మనీషాను కిడ్నాప్ చేసిన అగంతకులను కూడా ఎన్కౌంటర్ చేసిన పోలీసు శాఖ, అదే డిసెంబరు నెలలో ఇంజనీరింగ్ విద్యార్థినిలపై యాసిడ్ పోసిన నిందితులను ఎన్కౌంటర్ చేయడం మెచ్చుకోదగినదని జిల్లా వాసులు పేర్కొన్నారు.
కిట్స్ కళాశాల విద్యార్థినిలు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిపిన శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణలు శనివారం తెల్లవారుజామున పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. స్వప్నిక, ప్రణీతలపై దాడి జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని, ప్రజల్లోనే ఉరితీయాలని నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్కౌంటర్ను జిల్లా ప్రజలు సమర్థించడం గమనార్హం.
ప్రజల స్పందన విద్యార్థినిలు, ప్రజలు కోరుకున్న విధంగానే దోషులకు తగిన శిక్ష పడిందని కిట్స్ కళాశాల ప్రిన్సిపల్ గురురావు అన్నారు. నక్కలపల్లి - మామునూరు గ్రామాల ప్రజలు ఎన్కౌంటర్ ప్రాంతంలో మాట్లాడారు. నక్కలపల్లి సర్పంచ్ యాకూబ్ మాట్లాడుతూ... అరెస్ట్ చేయడం వల్ల న్యాయం జరగదని అనుకున్నామని చెప్పారు. ఎన్కౌంటర్ తగిన తీర్పేనని యాకూబ్ అభిప్రాయపడ్డరు. బీజేపీకి చెందిన ఎంపిటిసి రంజిత్ మాట్లాడుతూ.. చెడు కార్యక్రమాలకు పాల్పడేవారికి ఇదొక చక్కని గుణపాఠమని చెప్పారు.
భయం నీడలో ఉన్న మహిళలకు, విద్యార్థినిలకు ఈ ఎన్కౌంటర్ ధైర్యం ఇచ్చినట్లయిందని హైదరాబాద్లో బి.టెక్ చదువుతున్న వాణి అనే విద్యార్థిని చెప్పారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సరస్వతి అనే గృహిణి మాట్లాడుతూ... యాసిడ్ చల్లిన ఒక్కరినే (శ్రీనివాస్)నే చంపి ఉంటే, మిగతా ఇద్దరి కుటుంబ సభ్యుల్లో భయం నెలకొని ఇలాంటి చర్యలకు పూనుకునే వారు కాదని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా... వరంగల్ జిల్లాలో రౌడీషీటర్లకు, ఆకతాయిలకు బుద్ధి చెప్పిన విధంగానే జిల్లా పోలీసు యంత్రాంగం ప్రేమను తిరస్కరించినందుకు యాసిడ్ పోసిన నిందితులకు బుద్ధి చెప్పడం సరైన చర్యేనని ప్రజలు, స్థానికులు పేర్కొంటున్నారు.
వరంగల్ నగరంలో పలు నేరాలకు, హత్యలకు పాల్పడిన రౌడీషీటర్ కోగిల్వాయి రవిని 2006లో కాకతీయ యూనివర్శిటీ సమీపంలో పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత ఎన్కౌంటర్ చేశారు. వాహనాల తనీఖీల్లో భాగంగా రవి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, దానిని రవి తిరస్కరించి పోలీసులపై కాల్పులు జరపడంతో, ఎదురుకాల్పులు జరిపినట్లు అప్పటి పోలీసు అధికారులు తెలిపారు.
ఇదేవిధంగా వరంగల్ జిల్లాకు చెందిన మరో రౌడీ షీటర్ గడ్డం జగన్... హత్యలు, సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతూ.. కరుడుగట్టిన వాడిగా మారాడు. అక్టోబర్ 24న జగన్ను విచారణ కోసం తీసుకొస్తుండగా పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు.
అదేరోజు తెల్లవారుజామున గాలింపు చర్యల్లో నిమగ్నమైన పోలీసులు రంగరాజు పేట ప్రాంతంలో జగన్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే జగన్ అతని స్నేహితుడు సురేందర్ పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ జిల్లాలో మనీషా కిడ్నాప్ నిందితులకు, యాసిడ్ నిందితులకు, రౌడీషీటర్లకు పోలీసుశాఖ విధించిన శిక్ష సరైందేనని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.