టైగర్ వర్సెస్ రాములమ్మ

ఒకప్పుడు వారిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ కోసం పార్టీ వేదికలపై పోరాటం జరిపారు. ఇద్దరికీ సామాన్య జనంలో పేరుంది. వారిలో ఒకరు అపుడు ఉన్న పార్టీలో రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మరొకరు జాతీయ స్థాయి పార్టీ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నట్టుండి కాస్త ముందు.. వెనుకగా ఆ పార్టీలపై కోపం వచ్చి పార్టీలకు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత మరో పార్టీలో చేరారు. అక్కడా కోపం వచ్చి బయటకు వచ్చేశారు. ఒకరు మరో పార్టీలో చేరారు. మరొకరు సొంత పార్టీని స్థాపించి మరో పార్టీలో విలీనం చేశారు. వారిద్దరే ఆలె నరేంద్రం. సినీ నటి విజయశాంతి.

అలా.. రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన నరేంద్ర, విజయశాంతిలు ఇపుడు ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. మెదక్ స్థానం నుంచి వీరిద్దరు పోటీ చేస్తున్నారు. యూపీఏ విశ్వాస పరీక్షలో తమకు మేలు చేసినందుకు వైఎస్ నరేంద్రకు ఎంపీ టిక్కెట్ ఇచ్చి తన రుణం తీర్చుకున్నారు. అలాగే, ఇదే స్థానం నుంచి తెరాస జనరల్ సెక్రటరీ విజయ శాంతిని మెదక్ నుంచి తెరాస అధినేత కేసీఆర్ పోటీకి దించారు.

తొలుత ఈ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని భావించినప్పటికీ, విజయశాంతి మొండి పట్టుదల కారణంగా ఆమెను బరిలోకి దించారు. దీంతో ఈ స్థానంలో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. దీనికి తోడు ఒకే లక్ష్యం కోసం.. ఒకే పార్టీ నుంచి బయటకు వచ్చిన వీరిద్దరు ప్రస్తుతం విరోధులుగా తలపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి