అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

ఠాగూర్

శనివారం, 30 నవంబరు 2024 (12:35 IST)
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన సౌర విద్యుత్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా? అని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ, అదానీ ఒప్పందంపై అమెరికా లేఖను పూర్తిగా చదవాల్సి వుందన్నారు. అమెరికా రాసిన లేఖలో నాలుగు రాష్ట్రాల పేర్లు ఉన్నాయని, పైగా, ఈ ఒప్పందాలన్నీ జగన్‌కు తెలియకుండానే జరిగాయా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. 
 
అదేసమయంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజార్టీ వచ్చిందనీ, ఏపీలో మూడు బలమైన పార్టీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తమ పార్టీలో 25 లక్షల మంది కొత్తగా చేరారని వెల్లడించారు. సంస్థగత ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరమన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అర్హత ఉందన్నారు. గతంలో మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు