తండ్రుల గెలుపుకోసం పుత్రుల పాకులాట

WD
ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అభ్యర్థుల మధ్య పోటీ ఆకాశానికి అంటనుంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదవికోసం పోటీపడుతున్న వైఎస్, చంద్రబాబు, చిరంజీవి పుత్ర రత్నాలు తమ తండ్రుల గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల సంతానం సైతం తమదైన శైలిలో ఇంటింటికీ ప్రచార యాత్రను ముమ్మరంగా సాగిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఒకవైపు తండ్రికోసం పూర్తి స్థాయి ప్రచారం సాగిస్తూనే మరోవైపు కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇక ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నడుం బిగించిన కేసీఆర్ తనయుడు తారక రామారావు సైతం సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగడంతోపాటు తండ్రి కేసీఆర్‌కు విజయాన్ని కట్టబెట్టాలని ప్రజలను కోరుతున్నారు.

ఇవన్నీ ఇలావుంటే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కొత్తగా రాష్ట్ర రాజకీయ తెరపైకి వచ్చారు. ఉచిత నగదు పంపిణీ పథకం తన కుమారుడు లోకేష్ మది నుంచి పుట్టినదేనని చంద్రబాబు ప్రకటించడంతో లోకేష్ సైతం రాజకీయ గోదాలో దూకినట్లయింది.

ఎన్నికలలో పోటీ చేయకపోయినా తన తండ్రి పోటీ చేస్తున్న కుప్పంలో తండ్రి నామినేషన్ పత్రాలను అందజేయడానికి లోకేష్ నేడు అక్కడికి వెళ్లారు. కనుక వచ్చే ఎన్నికలలో లోకేష్ ఖచ్చితంగా పోటీ చేయడం ఖాయం అని తెలుస్తోంది.
WD


చంద్రబాబు వ్యూహాత్మకంగా నందమూరి వారసులకు చెందిన బాలయ్య కుమార్తెను తన కుమారుడు లోకేష్‌కి వివాహం చేసుకోవడం వెనుక నందమూరి వంశీయుల నుంచి భవిష్యత్ రాజకీయ వారసత్వ పోటీ లేకుండా ఉండేందుకేనని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

WD
ఇదిలా ఉంటే చిచ్చర పిడుగులా ప్రజలలోకి దూసుకొచ్చిన మరో యువకెరటం జూనియర్ ఎన్టీఆర్. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపిన జూనియర్ ఎన్టీఆర్, తాత స్మృతులను ప్రజలలోకి చొప్పించే ప్రయత్నం చేశారు.

కానీ దురదృష్టవశాత్తూ కారు ప్రమాదానికి గురై పర్యటనలకు దూరం కావలసి వచ్చింది. అయితే జూనియర్ హవా మరింతగా ఊపందుకుని ప్రజలలో మరింత ప్రాచుర్యం లభిస్తే... తెలుగుదేశం పార్టీలో అతనికి కీలక పదవి ఇవ్వక తప్పదు. ఆ పరిస్థితే కనుక ఎదురైతే భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీ పగ్గాలకై పోరు నెలకొనక తప్పదని కొందరు రాజకీయ నిపుణులు జోస్యం చెపుతున్నారు.

ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి వంతు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన తమ్ముళ్లు పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తూనే ఉన్నారు. అయితే తెరవెనుక చిరు కుమారుడు రామ్ చరణ్ తేజ, తన తండ్రి స్థాపించిన ప్రజారాజ్యం విజయం కోసం తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందించి చిరంజీవికి అందజేస్తున్నట్లు సమాచారం.
WD


ఇప్పటికే రామ్ చరణ్ పీఆర్పీకోసం పలు గీతాలను స్వయంగా గానం చేశారు. ఇక మిగిలిన పార్టీలలోని అగ్ర నేతల కొడుకులు, కూతుళ్లు త్వరలో తమ తల్లిదండ్రుల గెలుపుకోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఏదేమైనా యువత ప్రత్యక్ష రాజకీయాలపై మక్కువ చూపడం అభినందించదగ్గ విషయం.