మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

ఠాగూర్

సోమవారం, 28 జులై 2025 (10:05 IST)
ఈయన మా బావే.. పురుగుల మందు తాగాడా? తాగి చావనీ.. వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది... అంటూ తన అక్క భర్త చావుకు ఓ వ్యక్తి కారణమయ్యాడు. దీంతో అతనితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సిరికొండ మండలం, మైలారం గ్రామ శివారులో అయిలకుంట చెరువు వద్ద లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం కేసను పోలీసులు ఛేదించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన ఖాజా మొయినుద్దీన్ (43) అనే వ్యక్తికి 13 ఏళ్ల కిందట ఆర్మూర్‌కు చెందిన షేక్ లాయక్ (బబ్లూ) అనే వ్యక్తి అక్కతో వివాహం జరిగింది. బామ్మర్ది లాయక్ వద్దే మొయినుద్దీన్ సెంట్రింగ్ పని చేస్తూ ఆర్మూర్‌లోనే నివాసం ఉంటున్నారు. తాగుడుకు బానిస అయిన మొయినుద్దీన్.. నిత్యం తాగివచ్చి భార్యను వేధించసాగాడు. దీన్ని చూసిన లాయిక్.. తట్టుకోలేక పోయాడు. పలుమార్లు మందలించినప్పటికీ మొయినుద్దీన్‌లో ఎలాంటి మార్పు రాలేదు. 
 
ఈ క్రమంలో వీరిద్దరూ ఈ నెల 22వ తేదీన రామన్నపేట గ్రామంలో సెంట్రింగ్ పనులు చేయడానికి వెళ్లగా.. అక్కడే మొయినుద్దీన్ పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన లాయక్... వాడు చనిపోతేనే... మా అక్క ప్రశాంతంగా ఉంటుందని అంటూ వ్యాఖ్యలు చేస్తూ, పురుగుల మందు తాగిన బావను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. పైగా, మరో కూలీ అబ్దుల్ జబ్బర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి సిరికొండ మండలంలోని మైలారం గ్రామ శివారులోని అయిలకుంట చెరువు వద్ద పడేసి వెళ్లారు. 
 
మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు నిందితులు ఆర్మూ‍ర్‌కు చెందిన షేక్ లాయక్ (బబ్లూ), అబ్దుల్ జబ్బర్‌గా గుర్తించారు. వీరిని భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. 
 
మొయినుద్దీను సరైన వైద్యం అందించకుండా అతడి మృతికి కారణమైందున నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌‍కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది ప్రసాద్, రాములు, రాజు, రాజాలను ఏసీపీ అభినందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు