కళాఖండాల నెలవు... సాలార్‌జంగ్ మ్యూజియం

గురువారం, 16 అక్టోబరు 2008 (18:13 IST)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యాటకులు సందర్శించాల్సిన అనేక ప్రదేశాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాకుండా ఎన్నో అద్భుత సందర్శనా ప్రదేశాలను కల్గిన హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అలరాడుతోంది.

హైదరాబాద్‌లో పర్యటించాలనుకున్నవారు సందర్శించేందుకు ఎన్నో ప్రముఖ ప్రదేశాలున్నాయి. అలాంటివాటిలో సాలార్‌జంగ్ మ్యూజియం సైతం ఒకటిగా ఉంటోంది. ఎంతో చరిత్ర కల్గిన ఈ సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రాచీన కాలానికి చెందిన ఎన్నో విలువైన కలాఖండాలు కొలువుదీరి ఉన్నాయి. భారతదేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ఈ అద్భుత కళాఖండాలను కనులారా చూడాలంటే సాలార్‌జంగ్ మ్యూజియంను ఓసారి దర్శించి తీరాల్సిందే.

సాలార్‌జంగ్ మ్యూజియం చరిత్ర
హైదరాబాద్‌లోని మూసీనది దక్షిణ ఒడ్డున కొలువైన ఈ సాలార్జంగ్ మ్యూజియంను హైదరాబాద్‌ను పరిపాలించిన నిజామ్ పాలకులైన సాలార్‌జంగ్ కుటుంబీకులు ప్రారంభించారు. ఈ కుటుంబంవారు ప్రపంచంలో పలు ప్రదేశాలనుంచి ఎన్నో విలువైన కళాఖండాలను, అపురూప వస్తువులను సేకరించి సాలార్‌జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు.

సాలార్‌జంగ్ కుటుంబంలోని మూడవ సాలార్‌జంగ్‌గా ప్రముఖమైన మీర్ యూసుఫ్ అలీఖాన్ ఈ మ్యూజియంలోని వస్తువుల్లో అధిక భాగాన్ని సేకరించారు. ఈయనకు ముందు రెండవ సాలార్‌జంగ్‌గా ప్రముఖమైన మీర్ లయీఖ్ అలీ ఖాన్, మొదటి సాలార్‌జంగ్‌గా ప్రముఖమైన నవాబ్ మీర్ తురాబ్ అలీఖాన్‌లు కూడా మ్యూజియం కోసం వివిధ కళాఖండాలను సేకరించి పెట్టారు.

సాలార్‌జంగ్ విశేషాలు
సాలార్‌జంగ్‌కు చెందిన నగరమహల్‌లో ఉన్న 78 గదుల్లో దాదాపు 40,000 వరకు వివిధ రకాలైన కళాఖండాలున్నాయి. వీటిలో పరదాల మాటున ఉన్న రెబెక్కా, నూర్జహాన్ పండ్లు కోయడానికి వాడిన కత్తి, జహంగీర్‌కు చెందిన చురకత్తి, యాఖూతి ఉల్-మస్తానీకి చెందిన గడియారం, ఖురాన్ ప్రతిలాంటివి ప్రముఖమైనవి.

వీటితోపాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ గ్రంధాలు, పోర్సిలీన్, తుపాకులు, కత్తులు, శిల్పాలు లాంటివి కూడా ఉన్నాయి. ఇంతటి అపురూపమైన వస్తు సంపద ఉంది కాబట్టే సాలార్‌జంగ్ మ్యూజియంను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యం గల మ్యూజియంగా గుర్తించి కాపాడుతూ వస్తోంది.

సాలార్‌జంగ్ సందర్శన
సాలార్‌జంగ్ మ్యూజియంను భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 డిసెంబర్ 16 నుంచి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మ్యూజియం సందర్శకుల కోసం తెరవబడి ఉంటుంది. అయితే శుక్రవారం మాత్రం ఈ మ్యూజియంకు సెలవు.

వెబ్దునియా పై చదవండి