మండుతున్న ఎండలు... అరకులో కూల్‌కూల్‌గా...

బుధవారం, 16 మే 2018 (20:26 IST)
వేసవికాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి ఉత్సాహంగా గడపాలని ఉంటుంది. మనం చూడదగ్గ ప్రదేశాలలో అరకులోయ ఒకటి. దీని అందం చెప్పనలవిగాదు. అనుభవించితీరవలసిందే. కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చటి తివాచీ పరచి ప్రకృతి ప్రేమికులను రా.. రమ్మంటూ ఆహ్వానించే అందమైన ప్రదేశం అరకు.
 
ఎత్తైన కొండలు.. వాటి ప్రక్కనే లోతైన లోయలు తొలి సంధ్య సమయాన మంచు తెరల మధ్య చిరుగాలి పెట్టే గిలిగింతలు, పచ్చటి చెట్ల మధ్య నుండి తొంగితొంగి చూసే భానుడు, కొండ కోనల నడుమ జలజల పారే సెలయేరులు ఇలా ఎన్నో అందాలను తన సిగలో ఇముడ్చుకున్న భూతలస్వర్గం అరకు. దీనినే ప్రకృతి ప్రేమికులు ఆంధ్రా ఊటీగా పిలుచుకుంటారు.
 
అరకు వ్యాలీ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా డుంబ్రిగుడ మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం. జిల్లా కేంద్రం అయిన విశాఖపట్టణానికి 115 కిలో మీటర్ల దూరంలో ఒరస్సా బోర్డర్ సమీపాన తూర్పు కనుమల మధ్య అరకు విస్తరించి ఉంది. అరకు లోయ సముద్రమట్టానికి 600-900 ఎత్తులో వుంది. 46 బ్రిడ్జ్‌లను దాటుకుంటూ కొండలకు ఇరువైపులా విస్తరించి ఉన్న దట్టమైన చెట్ల నడుమ ఇక్కడికి చేరుకోవటం ప్రత్యేక అనుభూతిని పంచుతుంది. ఈ వేసవిలో అరకు సందర్శన మధురానుభూతిని మిగులుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు